హైదరాబాద్లో ఎంఫసిస్ కొత్త అభివృద్ధి కేంద్రం
సాఫ్ట్వేర్ సొల్యూషన్లను అందిస్తున్న ఎంఫసిస్ హైదరాబాద్లో కొత్త అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. మొదటి అభివృద్ధి కేంద్రంలో ప్రస్తుతం 300 మంది పనిచేస్తున్నారని, కొత్త కేంద్రంలో వచ్చే రెండేళ్లలో 500 మందిని నియమించుకునే అవకావం ఉందని ఎంఫసిస్ సీఈఓ, డైరెక్టర్ నితిన్ రాకేశ్ తెలిపారు. కొత్తతరం టెక్నాలజీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఈ కేంద్రంలో దృష్టి కేంద్రీకరిస్తారన్నారు. గత మూడేళ్లలో నిపుణుల సంఖ్య మూడింతలైందని, ఇప్పటివరకు పైనాన్షియల్ సొల్యూషన్లను అందిస్తున్నామని నితిన్ వివరించారు.
కొత్త కేంద్రం లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు సొల్యూషన్లను అభివృద్ధి చేయనుందన్నారు. డేటా ఎనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, జావా టెక్నాలజీ తదితరాల్లో నైపుణ్యాలున్న వారిని నియమించుకోనున్నట్లు తెలిపారు. కాగా ఇన్షర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి, పురోగతికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.













