మైనింగ్ మాఫియాపై హైడ్రా పంజా.. 20 అక్రమ కేంద్రాలు నేలమట్టం!
HYDRAA: అక్రమ మైనింగ్ , నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్లాంట్లపై హైడ్రా (HYDRAA) కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణానికి ముప్పుగా పరిణమించి, చుట్టుపక్కల గ్రామాలను కాలుష్యమయం చేస్తున్న 8 క్రషింగ్ యూనిట్లు , 12 ఆర్ఎంసీ (రెడీ మిక్స్ కాంక్రీట్) ప్లాంట్లను అధికారులు నేలమట్టం చేశారు.
చర్యలు తీసుకున్న ప్రాంతాలు..
రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి, వట్టినగులపల్లి, గోపన్నపల్లి , శంషాబాద్‌లోని కొత్త్వాల్గూడ ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు జరిగాయి. 8 క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లు నేలమట్టం చేసారు. వీటితో పాటు మైనింగ్‌కు ఉపయోగించే భారీ యంత్ర సామాగ్రిని కూడా అధికారులు ధ్వంసం చేశారు. భగత్ సింగ్ స్టోన్ క్రషర్, ఎస్వీకే, పరమేశ్వర్ స్టోన్, పృథ్వీ, గ్రేట్ ఇండియా మైనింగ్, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్‌కు చెందిన క్రషింగ్ యూనిట్లతో పాటు.. బీఎస్ఆర్, ఆల్ట్రాటెక్, ఏసీసీ వంటి రెడీమిక్స్ ప్లాంట్లపై చర్యలు తీసుకున్నారు.
వరుస కథనాల నేపథ్యంలో..
ఈ అక్రమ మైనింగ్ కంపెనీల ఆగడాలపై వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. కాలుష్య నియంత్రణ మండలి (PCB), గనుల శాఖ అధికారులు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి అక్రమ కేంద్రాల జాబితాను సిద్ధం చేశారు. వారి విన్నపం మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు చేపట్టింది. మరో పది ఆర్ఎంసీ ప్లాంట్లను కూడా త్వరలోనే తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అక్రమంగా రెడీమిక్స్ ప్లాంట్లు..
మరోవైపు, మొయినాబాద్ ప్రాంతంలో బాహ్య వలయ రహదారి (ORR) వెలుపల అక్రమంగా రెడీమిక్స్ ప్లాంట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. అజీజ్‌నగర్ సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్లాంట్లు నడుస్తున్నాయని, వీటివల్ల హిమాయత్‌సాగర్ జలాశయ మనుగడకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై కూడా అధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి








