ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించడంతో, ఉద్యోగ లోకం హర్షం వ్యక్తం చేసింది. తమ ఆందోళనలను విరమించుకుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ నిధులను ఏయే ప్రాధాన్యతలతో ఖర్చు చేయాలనే నిర్ణయాన్ని కూడా ఉద్యోగ సంఘాలకే వదిలేస్తూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల పెండింగ్ బిల్లులను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యకు కూడా ఈ సమావేశంలో పరిష్కారం లభించింది. జూన్ 1లోగా ఉద్యోగులందరికీ కొత్త ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మానవీయ కోణంలో ఆలోచించి, ఉద్యోగుల ఆరోగ్యం పట్ల తమకు ఉన్న బాధ్యతను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. దీంతోపాటు పీఆర్సీ నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారుల కమిటీని సీఎం ఆదేశించారు. రిపోర్ట్ అందిన వెంటనే పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
తమ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత స్నేహపూర్వకంగా ఉందో రేవంత్ రెడ్డి వివరించారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు తమ భుజాన వేసుకుని పనిచేశారని, మీ సహకారంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని కొనియాడారు. అధికారంలోకి రాగానే ప్రతినెలా మొదటి తారీఖునే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని, అలాగే గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొనియాడారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలతో సమావేశమై, నివేదికలు తీసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బిల్లులు పెండింగ్లో పడ్డాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి పెండింగ్ బిల్లులు సున్నాగా ఉండేవని, కానీ పదేళ్లలో ఆ పరిస్థితి తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం బకాయిలను క్లియర్ చేస్తోందని, వంద రోజుల్లో పెన్షనర్ల బకాయిలను చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీలతో ఉద్యోగ సంఘాల నాయకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ముందుకు రావడంతో ఆందోళన బాట వీడి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.








