కాంగ్రెస్ ‘ఇంద్రవెల్లి’ శంఖారావం
తెలంగాణలో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఈపార్టీ ఎన్నేళ్లు అధికారంలో ఉంటుందో అంటూ బీఆర్ఎస్, బీజేపీలు కామెంట్లు మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికారం పోయి విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయితే.. మరో ఆరునెలల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ కామెంట్లు చేశారు. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజలే కూల్చేస్తారంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే వీటికి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంద్రవెళ్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి.. గులాబీనేతలకు గట్టిగానే వార్నింగిచ్చారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాలేదు.. అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదు.. మేము 2 నెలల్లో ఎలా చేయగలం? 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో 2లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత మాది. ఇప్పటికే 7వేల ఉద్యోగాలు ఇచ్చాం.
తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో, ఎవరు అభివృద్ధి పథంలో నడిపిస్తారో ప్రజలు ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నది రెండే కూటములు.. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారని ఆరోపించారు రేవంత్ కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని విమర్శించారు రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు తెచ్చింది.
కేసీఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? పదేళ్లలో ఏనాడైనా ఇంద్రవెల్లి అడవిబిడ్డల గురించి ఆలోచించారా? సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్ ప్రగతి భవన్కు వెళ్తే గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి రూ.వేలకోట్లు దోచుకున్నారు.15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు రేవంత్.













