లోక్సభ ఎన్నికల్లోపు రేవంత్ టార్గెట్ ఇదే..!
లోక్ సభ ఎన్నికల్లోపు ఎలాగైనా పార్టీ బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 10-12 స్థానాలైనా రావాలనేది ఆయన పట్టుదల. అందుకోసం తెరవెనక రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. ఉదయం, రాత్రి వేళల్లో ఇంటి దగ్గర పూర్తి సమయాన్ని ఆయన పార్టీ కోసమే కేటాయిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఆయన మొదట గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. మొత్తం 117 స్థానాల్లో బొటాబొటి మెజారిటీతో ఆ పార్టీ గట్టెక్కింది. మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు దక్కింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇందులో 10-12 స్థానాలు గెలవాలనేది ఆయన టార్గెట్. హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఎంఐఎంకు పక్కా. ఇక మిగిలిన వాటిపైనే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో 9 సీట్లు దక్కాయి. ఈ సారి ఆ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కకూడాదనేది రేవంత్ పట్టుదల.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించింది.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో తప్ప.! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. దీంతో ఇక్కడ ఆ పార్టీకి ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పైనే కన్నేశారు. ప్రస్తుతం గ్రేటర్ పీఠం బీఆర్ఎస్ చేతిలో ఉంది. దాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నారు రేవంత్. అందుకే బీఆర్ఎస్ కౌన్సెలర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేశారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
గ్రేటర్ పీఠంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించేందుకు రేవంత్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిసి కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, కూడా ఉన్నట్టు సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు అప్పగించినట్లు సమాచారం. కాబట్టి లోక్ సభ ఎన్నికల్లోపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.













