కాంగ్రెస్ పాలనకు రెఫరెండమా..?

తెలంగాణలో పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ సర్కార్.. 90 రోజుల పాలన పూర్తి చేసుకుంది. అధికారంలోకి తెచ్చి న ఆరు గ్యారెంటీలను ఒకొక్కటిగా అమలుచేస్తోంది.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ బండ అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేస్తూ పోతోంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. ప్రజల్లోకి విస్తృతంగా తిరుగుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో తమ 90 రోజుల పరిపాలన.. రెఫరెండంగా తీసుకుందామన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ పాలన మరీ అంత బ్రహ్మాండంగా ఉందా…? ఆయన ఏ ధైర్యంతో అంతమాట అనగలిగారు..? ఈ విషయానికొస్తే.. ముఖ్యంగా విపక్ష బీఆర్ఎస్.. క్రమంగా వీకవుతూ వస్తోంది. ఓవైపు కాంగ్రెస్ .. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, క్రిందిస్థాయి కేడర్ పై వలేస్తుంటే.. తమకు అవసరమైన ఎంపీ అభ్యర్థుల కోసం.. సిట్టింగ్ ఎంపీలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. రెండు పార్టీలు .. తమ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుండడంతో.. గులాబీ పార్టీ తట్టుకోలేకపోతోంది. ఎవరు ఈరోజు పార్టీలో ఉన్నారు..? రేపు ఉంటారో.. ఉండరో అన్న పరిస్థితి గులాబీ దళంలో కనిపిస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ చరిష్మా ఉన్నప్పటికీ… రాష్ట్రంలో మాత్రం బీజేపీకి … క్షేత్రస్థాయిలో అంత పట్టులేదు. దీంతో ఈ ఇద్దరితో పోలిస్తే కాంగ్రెస్ కాస్త బలంగా ఉంది. దీనికి తోడు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. గ్యారెంటీల అమలుతో పాటు జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేస్తుండడంతో.. నిరుద్యోగయువతకు తమపై గురి కుదిరిందని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు మధ్య ఓటు చీలి తాము సురక్షితంగా అధిక ఎంపీ స్థానాలు దక్కించుకుంటామన్న విశ్వాసం రేవంత్ టీమ్ లో కనిపిస్తోంది.
ఇటీవలే మరో పదేళ్ల నేనే అధికారంలో ఉంటా.. కేసీఆర్ ఎలా వస్తాడో చూస్తా.. అని ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం సైతం చూశాం. అంటే హైకమాండ్ దగ్గర ఎంత పలుకుబడి లేకుంటే… ఓ కాంగ్రెస్ సీఎం మరో పదేళ్లు నేనే సీఎం అనగల ధైర్యం చేస్తారో అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్నన్ని ఎంపీ సీట్లు సాధిస్తే… ఇక రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ కు మరో ముఖంలా మారే అవకాశముందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.