బీఆర్ఎస్కు రాజ్యసభ ఎన్నికల టెన్షన్..!!?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుంటే కొన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనేది ఆసక్తి కలిగిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కుతాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెడితే ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు తమ సీటు గల్లంతవుతుందేమో అనే భయం బీఆర్ఎస్ ను వెంటాడుతోంది.
దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు రేపే (15) ఆఖరు తేదీ. తెలంగాణలో బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రామచంద్ర పదవీకాలం ముగుస్తోంది. ఈ మూడు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే వారిపై క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుక చౌదరికి బెర్త్ ఖాయమైనట్టు తెలుస్తోంది. మరో స్థానాన్ని అనిల్ యాదవ్ కు కేటాయించవచ్చని సమాచారం. టీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రామచంద్ర మరోసారి రేసులో ఉన్నారు. అలాగే రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. అయితే రెండు పార్టీలూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65 మంది సభ్యుల బలముంది. బీఆర్ఎస్ కు 39 మంది సభ్యులున్నారు. బీజేపీకి 8, ఎంఐఎంకు 7గురు ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడ్ని ఎన్నుకోవడానికి 30 మంది అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కడం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని బరిలోకి దించుతుందేమో అనే భయం బీఆర్ఎస్ ను వెంటాడుతోంది. ఒకవేళ అదే జరిగితే ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారో అని ఆందోళన చెందుతోంది. తమకు సొంతంగానే సరిపడా బలం ఉన్నా సీటు కోల్పోవాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ 2 సీట్లను గెలుచుకోవడానికి 60 మంది చాలు. అలా ఓటేసిన తర్వాత ఐదుగురు సభ్యులు ఇంకా ఆ పార్టీ దగ్గర ఉంటారు. ఒకవేళ ఎంఐఎంను తమవైపు తిప్పుకుంటే మరో ఏడుగురు కలుస్తారు. అప్పుడు 12 మంది అవుతారు. అయినా సీటు దక్కించుకోవాలంటే 18 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వదు కాబట్టి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి 18 మందిని కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. మరికొందరు కూడా పార్టీని వీడుతారేమో అని సంకేతాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేల తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస సీటు గల్లంతవడం ఖాయం. ఇదే ఇప్పుడు ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













