గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం కలిసొచ్చే వరకూ అంతా బాగానే ఉంటుంది. కాలం కలసిరాకపోతే ప్రతిచోటా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పరిస్థితి కూడా ఇంతే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ విజయప్రస్థానం అప్రతిహతంగా సాగింది. కానీ ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు అపజయం మరోవైపు బలహీనమవుతుండడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టారు కేసీఆర్. అందుకోసం ఆయన ఎన్నో విధాలుగా ఉద్యమిస్తూ వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గొంగళిపురుగునైనా ముద్దాడతానని చెప్పుకొచ్చిన కేసీఆర్.. అందుకోసం కాంగ్రెస్, టీడీపీ లాంటి పార్టీలతో కలిసి పని చేశారు. ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 2014లో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆ తర్వాత 2019లో కూడా రెండోసారి విజయం దక్కింది. దీంతో ఆ పార్టీకి తిరుగులేదని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 2023లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి అధికార పగ్గాలు చేపట్టింది.
తెలంగాణలో ఓటమిని బీఆర్ఎస్ అస్సలు ఊహించలేదు. కచ్చితంగా తాము హ్యాట్రిక్ కొడతామనుకున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకోసం టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ గా ముందుకెళ్లారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి కట్టేందుకు వివిధ పార్టీలతో చర్చలు జరిపారు. అయితే కేసీఆర్ తో కలిసి ముందుకెళ్లేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. ఒకవేళ తెలంగాణలో గెలిచి ఉంటే కేసీఆర్ కు కాస్తోకూస్తో కాలం కలిసొచ్చేదేమో.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక సిట్టింగ్ ఎంపీలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున టికెట్లు కూడా తెచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఖంగుతింది. ఎన్నికల్లోపు మరికొంతమంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు దూరంగా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యమ కాలం నాటి పరిస్థితిలు ఇప్పుడు లేవు. అధికారం కూడా లేదు. దీంతో బీఆర్ఎస్ వైపు చూసేవాళ్లే లేకుండా పోయారు. అందులో ఉన్న నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. దీంతో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు పెద్ద సవాలే.!