గులాబీ కోటపై బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన పోరులోకి, నేడు తాము కూడా రేసులో ఉన్నామంటూ బీజేపీ ముందుకొస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలను కైవసం చేసుకుని, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు మిషన్ 2028 లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి, క్షేత్రస్థాయి నేతలే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో పదేళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉంది. ముఖ్యనేతలు కొందరు ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గస్థాయి నేతలపై ఇప్పుడు బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పునాదులను కదిలించడం ద్వారా, ఆ పార్టీ రాజకీయ ఉనికి ముగిసిందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును శాశ్వతంగా తమవైపు తిప్పుకోవాలన్నది కమలదళం పక్కా స్కెచ్.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కీలక నేతలు ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లకు అప్పగించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై పూర్తి పట్టున్న ఈటల రాజేందర్, ఆ పార్టీలోని అసంతృప్త నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బండి సంజయ్ తనదైన శైలిలో హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ, యువతను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో కూడా పాగా వేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే తెలంగాణలో రాజకీయాలు రెండు ధ్రువాలుగా విడిపోతున్నాయి. కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ప్రచారం చేస్తోంది. గతంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓటర్లు, ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడటంతో సహజంగానే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి గతంలో మైనస్ అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను చేర్చుకుని ఆ లోటును భర్తీ చేయాలని చూస్తోంది.
2028 నాటికి తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌ను అలాగే కొనసాగించాలంటే, కేవలం చేరికలపైనే కాకుండా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, అదే సమయంలో బీఆర్ఎస్ కేడర్‌ను తమ గూటికి చేర్చుకోవడంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మొత్తానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు వరుస కడితే.. తెలంగాణలో రాబోయే కాలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధానికి వేదిక కావడం ఖాయం. ఒకవేళ బీజేపీ అనుకున్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయితే, 2028 నాటికి తెలంగాణలో కమలం వికసించడం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
ఇవి కూడా చదవండి








