ఫస్ట్ లిస్ట్ రెడీ చేస్తున్న తెలంగాణ బీజేపీ!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేసి దూసుకపోతోంది. రేసులో వెనుకబడ్డ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ను ఓడించి ఈసారి తెలంగాణను సొంతం చేసుకోబోతున్నామని బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. అయితే ఎన్నికల ముంగిట ఆ పార్టీ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఎన్నికల రణరంగంలో స్పీడ్ పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. త్వరలోనే మొదటి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. బీజేపీ కేంద్ర ఎన్నిక సంఘం అన్నీ వడపోసిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ తోపాటు పలువురు సభ్యులుగా ఉన్నారు. నేతల బలాబలాలను పరిశీలించిన తర్వాత ఈ కమిటీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన తర్వాత పార్టీ అభ్యర్థులను అధికారికంగా విడుదల చేయనుంది.
ఈ వారం, పది రోజుల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. తెలంగాణ నుంచి దాదాపు 35 మంది అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకుల జాబితా కేంద్ర ఎన్నికల కమిటీకి చేరింది. వీరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి.. ఎవరి బలమెంత.. సామాజిక సమీకరణాలేంటి.. ఆర్థికంగా బలమైన వారా.. లాంటి అనేక అంశాలను ఈ కమిటీ పరిశీలించిన తర్వాత అభ్యర్థులను వడపోయనుంది. ఈ నెల 10 తర్వాత మొదటి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
మొదటి జాబితాలో దాదాపు 35 నుంచి 40 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. పార్టీ సీనియర్ నేతలందరినీ అసెంబ్లీ బరిలో దించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్లను కూడా అసెంబ్లీకి పోటి చేయించేందుకు హైకమాండ్ రెడీ అయింది. కేసీఆర్ ఈ దఫా రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇందులో గజ్వేల్ లో కేసీఆర్ పైన ఈటల రాజేందర్ ను పోటీ చేయించేందుకు రెడీ అయింది బీజేపీ. అలాగే కామారెడ్డిలో ఎంపీ ధర్మపురి అరవింద్ ను కేసీఆర్ పై పోటీ చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇలా బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా పార్టీకి పాజిటివ్ సంకేతాలు వస్తాయని నమ్ముతోంది. అలాగే చేరికలు కూడా అధికమవుతాయని భావిస్తోంది.













