తెలంగాణలో అందివచ్చిన అవకాశాలను బీజేపీ మిస్ చేసుకుంటోందా..?
దక్షిణ భారతదేశంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కర్నాటక మినహా మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. అయితే తెలంగాణ మాత్రం కాస్తోకూస్తో ఆ పార్టీకి కేడర్ ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కూడా సొంతంగా గెలుచుకుంటోంది. డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని, వస్తామని ఆ పార్టీ గట్టిగా చెప్పేది. కానీ ఆ పార్టీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీ ఎదిగేందుకు గతంలో ఎన్నడూ లేనంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అయినా ఇలాంటి అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ లోని పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎంతో బలమైన నేతలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఐదేళ్లపాటు పదవులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతలకు దిక్కుతోచడం లేదు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానాలు అందితే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ లో అధికారంలో ఉంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలున్నాయి.
బీఆర్ఎస్ నేతలకు గాలం వేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు నేతలు సిద్ధంగా ఉంటారు. ఈ అంశాన్ని చక్కగా వినియోగించుకుంటోంది ఆ పార్టీ. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ ను కలిసి తమ ఇష్టాయిష్టాలను వెల్లడించారు. కొంతమంది పార్టీలో చేరిపోయారు. మరికొందరు అవసరమైనప్పుడు పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమని వెల్లడించారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సత్తా లేదు. నిత్యం కలహాలతో ఆ పార్టీ కాపురం చేస్తూ ఉంటుంది. గెలిచినా ఆ పార్టీ చాలాకాలం అధికారంలో ఉండదని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అత్యంత బలమైన బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని సర్వేలు ఘోషిస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లోని బలమైన నేతలను ఆకర్షించేందుకు ఆస్కారం ఉంది. అయినా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఆ దిశగా అసలు దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నవాళ్లు, కాంగ్రెస్ లో టికెట్ దక్కని వాళ్లను తమవైపు తిప్పుకునేందుకు ఇదే తగిన సమయం. మళ్లీ గెలిస్తే ఐదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉంటారు. అదే విషయాన్ని సొమ్ము చేసుకోవడంలో తెలంగాణ బీజేపీ ఫెయిల్ అవుతోందని మాత్రం చెప్పొచ్చు.













