పొంగులేటి షరతులకు బీజేపీ ఓకే..! త్వరలోనే కమలం గూటికి ఖమ్మం నేత..!!
మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. చాలాకాలంగా ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ బీజేపీ నేతలు జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఆయన అధికారికంగా బీజేపీలో చేరబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పొంగులేటితో పాటు చర్చల్లో పాల్గొన్నారు. ఆయన కూడా కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను సీఎం కానివ్వబోనని, బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పని చేస్తానని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ను గద్దె దించగలిగే పార్టీలోనే చేరతానని ప్రకటించారు. తనతో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ టచ్ లో ఉన్నాయని, అయితే తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తూ వచ్చారు. అయితే బీజేపీ చేరిక కమిటీ ఇవాళ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమైంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డితలతో కూడిన కమిటీ పొంగులేటి నివాసంలో దాదాపు మూడు గంటలపాటు భేటీ అయింది. ఈ చర్చల్లో జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను తనకు అప్పగించాలని, తాను చెప్పిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని, ఖమ్మం నుంచి ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా చూస్తానని పొంగులేటి ప్రకటించారు. అందుకు అంగీకరించే పార్టీలోనే చేరాలనేది ఆయన అభిమతం. ఇప్పుడు పొంగులేటి డిమాండ్లకు బీజేపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఖమ్మంలో బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. పొంగులేటి లాంటి గట్టి పట్టున్న నేత తమ పార్టీలోకి రావడమే మహాప్రసాదం. అందుకే పొంగులేటి డిమాండ్లకు వెంటనే అంగీకరించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పొంగులేటికి ఆహ్వానం ఉంది. అయితే పొంగులేటి చెప్పినట్లు కాంగ్రెస్ లో ఆటలు సాగవు. ఆయన చెప్పిన వాళ్లకు జిల్లాలో సీట్లు ఇవ్వడం కష్టం. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి లాంటి వాళ్ల ముందు పొంగులేటి పెత్తనం కుదరదు. అందుకే కాంగ్రెస్ లో కాకుండా బీజేపీలో చేరేందుకే పొంగులేటి మొగ్గు చూపారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు కూడా పొంగులేటితో పాటే కమలం గూటికి చేరేందుకు అంగీకరించారు. త్వరలోనే జిల్లాల్లో పెద్దఎత్తున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అందులో పార్టీలే చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.













