మాజీ మంత్రి బాలినేనికి చేదు అనుభవం
మాజీ మంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా మర్కాపురంలో సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అయన్ను అడ్డుకున్నారు. దీంతో బాలినేని అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా ముఖ్యనేతలు మార్కాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ వద్దకు మంత్రులు, ఇతర నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని ఆయనకు సూచించారు. దీంతో పోలీసులపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైఖరికి నిరసనగా అక్కడ నుంచి ఆయన వెనుదిరిగారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు యత్నించినా బాలినేని శాంతించలేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలుకు బయల్దేరారు. చివరికి సీఎం జగన్ కల్పించుకుని ఫోన్లో మాట్లాడటంతోనే బాలినేని అలకవీడి మళ్లీ సభకు వచ్చినట్లు సమాచారం. అయితే సభ ప్రారంభమయ్యేసరికి మాత్రం వేదికపై ఆయన కనిపించారు. సీఎం జగన్ జోక్యంతోనే బాలినేని అలకవీడినట్లు తెలిసింది.













