YS Jagan: జగన్ వాళ్లను ఎందుకు పరామర్శించలేదు..?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన రెండు భారీ మానవ తప్పిదాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో 28 మంది, రాజమండ్రి కల్తీ పాలు సేవించి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 42 కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిన ఈ ఘటనలు రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైసీపీ ఈ ఘటనల పట్ల స్పందించిన తీరు, పార్టీ అగ్ర నాయకత్వం వహించిన మౌనం ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గత మథనానికి కారణమవుతోంది.
వేట్లపాలెంలో బాణసంచా తయారీలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరోవైపు, రాజమండ్రిలో కల్తీ పాల సరఫరా కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ 14కు చేరింది. ఈ ఘోరాలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇంతటి భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా ఇవ్వడంలో పార్టీ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి బాధితులను పరామర్శించి ఉంటే బాగుండేదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. గతంలో పిఠాపురంలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. మరి ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదం జరిగినా ఎందుకు స్పందించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయతే ఈ ఘటనలపై జగన్ కు సరైన సమాచారం లేదని కొంతమంది చెప్తున్నారు. తాము జరిగిన విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు వివరించామని, నిర్ణయం తీసుకోవాల్సింది పైస్థాయి నాయకత్వమేనని జిల్లా నేతలు వాదిస్తున్నారు. అయితే.. జిల్లా నేతలు కేవలం సమాచారం ఇచ్చి వదిలేయకుండా, పదే పదే గుర్తు చేసి ఉండాల్సిందని, వారిలో చొరవ లోపించిందని పార్టీ పెద్దలు విమర్శిస్తున్నారు. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదని, కేడర్ మొత్తం చిన్నాభిన్నమైందని కొందరు చెప్తున్నారు. అందుకే ఈ జిల్లాకు రావడానికి జగన్ ఇష్టపడలేదని పార్టీలోని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, ప్రభావితమైన వారు వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో ఇతర పెద్ద రాజకీయ అంశాలు లేని సమయంలో కూడా, ప్రభుత్వం విఫలమైన కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ ఆలస్యం చేసిందని పార్టీ వర్క్ షాప్ లో కూడా చర్చకు వచ్చింది.
రాజకీయాలను పక్కన పెడితే, ఇంతటి భారీ మానవతా సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నా, కమ్యూనికేషన్ లోపాలు లేదా వ్యూహాత్మక తప్పిదాల వల్ల వైసీపీ ఈ విషయంలో వెనకబడిందనేది స్పష్టమవుతోంది.








