విభజన సమస్యలున్నా.. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోంది : విజయసాయిరెడ్డి
ఎన్నో విభజన సమస్యలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. అత్యధికంగా తలసరి ఆదాయం సాధిస్తున్న రాష్ట్రాల జాబితాలో మిగతా దక్షిణాది రాష్ట్రాలకు గట్టి పోటీ ఇస్తోందని తెలిపారు. విభజన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఏపీ ఈ ఘనత సాధించడం మాటలు కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక సర్వే గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని వివరించారు.
దేశంలో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,50,007గా ఉందని, అదే సమయంలో ఏపీ తలసరి ఆదాయం రూ. 2,07,771గా ఉందని విజయసాయి వెల్లడించారు. ఫార్మా, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ తలసరి ఆదాయం రూ. 2,65,623గా ఉండగా.. బడా పరిశ్రమలు లేకపోయినా ఏపీ తలసరి ఆదాయం చాలా ఎక్కువగానే ఉందని వివరించారు. రాష్ట్రానికి చెందిన టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారని, దీని వల్లనే ఏపీ తలసరి ఆదాయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆర్థికాభివృద్ధి విషయంలో కర్ణాటక, హైదరాబాద్ మధ్య గట్టి పోటీ ఉందని చెప్పిన ఆయన.. అదే సమయంలో ఏపీ సహా మరో మూడు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆర్థిక వృద్ధి రేటులో వేగంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు.













