టీడీపీలోకి వారసులొచ్చారు
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో పది మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న వారే. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) స్థానంలో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత (రాప్తాడు) స్థానంలో ఆమె కుమారుడు శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి) స్థానంలో ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి, గౌతు శ్యాంసుందర శివాజీ(పలాస) స్థానంలో ఆయన కుమార్తె శిరీషకు అవకాశమిచ్చారు. జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ) స్థానంలో ఆయన కుమార్తె షబానా ఖాతూన్, ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(అరకు) స్థానంలో ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు అభ్యర్థిత్వాలు దక్కాయి. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి వారసుడు భానుప్రకాష్‌కు నగరి స్థానం లభించింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని (చీపురుపల్లి) స్థానంలో ఆమె కుమారుడు నాగార్జునకు అవకాశమిచ్చారు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌కు గుడివాడ అభ్యర్థిత్వం దక్కింది. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమార్తె భవానికి రాజమహేంద్రవరం నగరం స్థానం లభించింది.













