ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ : మంత్రి లోకేష్
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ!
నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు జిల్లా అభివృద్ధికి కృషిచేశారు
జులై 15నుంచి కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం
గొడ్డలిపార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్ దే
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం
శ్రీకాళహస్తి టిడిపి కార్యకర్తల సమావేశంలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
శ్రీకాళహస్తి: ఈ రోజు మేం పదవుల్లో కూర్చోవడానికి టిడిపి కేడర్ చెమట, త్యాగమే కారణం. వారి త్యాగాలను ఎన్నడూ మరువబోమని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం రేణిగుంట సమీపంలోని కొత్తపాలెంలో జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేకమైన ప్రేమ. స్టూడెంట్ లీడర్ గా ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేల చిత్తూరుజిల్లా. స్వర్గీయ ఎన్టీఆర్ కు కూడా చిత్తూరుపై ప్రేమ ఉంది. మహిళలకు ఉన్నత విద్య అందించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటుచేసిన నాయకుడు ఎన్టీఆర్. వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్. చంద్రబాబు గారు 2003లో ప్రాణదాన ట్రస్ట్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెచ్చిన ఘనత చంద్రబాబుది. ఒక పక్క ఎన్టీఆర్, ఇంకోవైపు చంద్రబాబు ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేశారు.
ఇవి కూడా చదవండి
కుంభకోణాల్లో మునిగిన చరిత్ర గొడ్డలి పార్టీది
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే జీరో చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో గొడ్డలిపార్టీని ఎలా శిక్షించారో చూశాం. ఉమ్మడి చిత్తూరులో మనపార్టీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులను బేరీజు వేయండి. దోపిడీ, దౌర్జన్యాలు, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, టిడిఆర్ కుంభకోణాల్లో మునిగిన చరిత్ర వైసిపి నేతలది. మన పార్టీలో గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎన్. శివప్రసాద్ లాంటి నిష్కళంక నాయకుల చరిత్ర మనది. ఇప్పుడు యువరక్తం కూడా ముందుకు నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట శ్రీకాళహస్తి నియోజకవర్గం. గోపాల్ అన్నకు, బాబు గారికి ఉన్న బంధం… మీ లోకేష్ కు– సుధీర్ కు ఉంది. ఆయన ఓవర్ స్పీడ్ వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బడాచోర్ ఎలా వేధించారో, దానివల్ల ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూశాం. సుధీర్ నేను చేయలేని పని చేశారు. అనంత్ అంబానీ ద్వారా సుమారు 50కోట్లు విరాళాలు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో బాగా చదువుకున్న పిల్లల కుటుంబాలకు 3సెంట్ల భూమి ఇచ్చారు.
పనిచేసిన కేడర్ కు న్యాయం చేసే బాధ్యత నాది
మనమంతా కలసికట్టుగా ముందుకు నడవాలి. 2025మహానాడులో ఆరుశాసనాలను ప్రకటించాం. అందులో ముఖ్యమైంది కార్యకర్తే అధినేత. పుంగనూరులో అంజిరెడ్డి తాత, పల్నాడులో మంజుల, విజయవాడలో చెన్నుపాటి గాంధీ, పార్టీకోసం ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనకు ఆదర్శం. పక్కరాష్ట్రంలో ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే ఎలా అయ్యారో చూశాం. 45ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలబడింది తెలుగుదేశం. నేను తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 8మందికి రాష్ట్రస్థాయి, 53మందికి నియోజకవర్గస్థాయి పదవులు ఇచ్చాం. ప్రతిపదవిని చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్క పొరపాటు జరిగినా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాది.
కార్యకర్తలకు అండగా నిలుస్తాం
పాడిరైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ఆనాడు పీలేరులో ఒక్క మిల్క్ చిల్లింగ్ సెంటర్ పెట్టారు. నా తల్లి భువనేశ్వరి, బ్రాహ్మణి కష్టం వల్ల హెరిటేజ్ ఉన్నతస్థాయికి చేరింది. మూడు దశాబ్ధాల తర్వాత 7లక్షల లీటర్ల పాలసేకరణ స్థాయికి వచ్చింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించాలనుకోవడం చాలా తప్పు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అప్పగిస్తున్నాను. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి నియోజకవర్గంలో 25మందితో చిన్నతరహా పరిశ్రమలు పెట్టించారు. దానిని ఇక్కడ కూడా అమలుచేయండి, అండగా నిలుస్తాం. క్లస్టర్ ఇన్ చార్జిల ట్రైనింగ్ లో భాగంగా యోగా నేర్పించాం, యూనిట్ సభ్యులకు ట్రైనింగ్ తాజాగా ప్రారంభించాం. సుమారు 1300 మంది యూనిట్ ఇన్ చార్జిలకు పరీక్షలు చేస్తే 75శాతం మందికి సుగర్, బిపి, కొలెస్ట్రాల్ ఉన్నాయి. చాలామందికి ఆరోగ్య సమస్య ఉందని కూడా తెలియదు. క్లస్టర్, యూనిట్, గ్రామస్థాయి వరకు నాయకులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందజేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
కలసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దాం
తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం. కోటిమందికి పైగా ఉన్న అతిపెద్ద వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. అంతర్గతంగా వాటిని పరిష్కరించుకోవాలి. బయటకు వెళ్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ఏకతాటిపై నిలవాలి. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దాం.
కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
కూటమి ప్రభుత్వ విజయాలపై జులై 15వతేదీ నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమం డోర్ టు డోర్ క్యాడర్ ప్రచారం చేయాలి. జులై 16,17,18 మెగా పిటిఎం నిర్వహించే సమయంలోనే తల్లికి వందనం రెండో విడత డబ్బు తల్లుల ఖాతాలో జమచేస్తాం.
సంక్షేమంతోపాటు పెద్దఎత్తున అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులు ప్రవాహంలా వస్తున్నాయి. యువగళంలో మెగా డిఎస్సీ హామీ ఇచ్చా. ప్రజలఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక 150రోజుల్లో 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. 6వేల కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇచ్చాం. ఈ ఏడాది 10వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలండర్ ప్రకటించాం. ఆగిపోయిన అమరావతి, పోలవరం పనులను పరుగెత్తిస్తున్నాం. మనం సాధించిన ఈ విజయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ప్రజలతో అనుబంధం పెంచుకోండి
పార్టీ కేడర్ ఓపికగా ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకం కావాలి. 1985 తర్వాత గెలవని మంగళగిరిలో పోటీచేసి నేను తొలిసారి ఓడిపోయా, అదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిచా. నాకు, ప్రజలకు మధ్య ఏర్పడిన అనుబంధమే ఈ ఘన విజయానికి ప్రధాన కారణం. ఇలాంటి అనుబంధాన్ని ప్రతి కార్యకర్త ప్రజలతో కొనసాగించాలి. కష్టపడి పనిచేసిన వాళ్లను గుర్తించేందుకు మై టిడిపి యాప్ తెచ్చాం. ప్రతి కార్యకర్త ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వారుచేసిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీకి తెలియజేయండి.
గొడ్డలిపార్టీ విధ్వంసాన్నీ ప్రజలకు తెలియజేయండి
మన రాష్ట్రంలో గొడ్డలిపార్టీ ఉంది, వారికి కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయి. వాళ్లకు గంజాయి, బ్లేడ్, సైకో బ్యాచ్ లు ఉన్నాయి. వారి నేరచరిత్రను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లండి.
లా అండ్ ఆర్డర్ గురించి జగన్ మాట్లాడుతున్నారు. వైసిపి ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు. గొడ్డలిపార్టీ హత్యాకాండను ప్రజలకు వివరించాలి. జగన్ మాటతప్పం, మడమ తిప్పం అంటారు. వాళ్లు అబద్దాలు చెప్పినట్లు, మనం నిజాలు కూడా చెప్పలేకపోతున్నాం. మొన్నటివరకు 3రాజధానులు అన్న జగన్ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు, రేపు బెంతాహై అంటాడు. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. గొడ్డలిపార్టీ అరాచకం, వేధింపులు, అహంకారం వంటి అవలక్షణాలు మనవాళ్లకు అంటకూడదు. ప్రజలు మనం పొరపాటు చేయకూడదని కోరుకుంటున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేయాలి. అహంకారం, అవినీతికి తావీయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలి.
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం
రాష్ట్రం స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ఒకే ప్రభుత్వం సుదీర్ఘంగా ఉండటం వల్ల గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. ఆ రాష్ట్రాలకు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ప్రతి వందరూపాయల పెట్టుబడుల్లో 25రూపాయలు ఏపీకి వస్తున్నాయి. మిగతా 75 రాకపోవడానికి వైసిపి విధ్వంస పాలనే కారణం. గొడ్డలిపార్టీ వస్తే మా పరిస్థితి ఏమిటని ఈరోజు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ముందు కేడర్ ను కలిశాకే చంద్రబాబు, నేను అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నాం. కలసికట్టుగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నదే మన నినాదం కావాలి. రెడ్ బుక్ దానిపని అది చేస్తుంది. కేడర్ కు ఎటువంటి డౌట్లు అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పునరుద్దరించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంటు ఇన్ చార్జి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణినాయుడు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.








