జైల్లోనూ ఎమ్మెల్సీ అనంతబాబు ‘రుబాబు’..!
రాజమండ్రి సెంట్రల్ జైలు అంటేనే కఠిన నిబంధనలకు మారుపేరు. కానీ, అక్కడ కూడా తన అధికార దర్పం ప్రదర్శించే ప్రయత్నం చేశారు వైసీపీ(YCP) ఎమ్మెల్సీ అనంతబాబు(Ananth Babu). గతంలో జైల్లో ఉన్న సమయంలో ఏర్పడిన పరిచయాలతో.. ఆయన అధికారులతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “నేను ఎమ్మెల్సీని అని మీకు తెలియదా..? నా హోదా ఏంటో మీకు గుర్తు లేదా..?” అంటూ జైలు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పిన సిబ్బందిని తన పదవి అడ్డుపెట్టుకుని బెదిరించే ప్రయత్నం చేయడం కలకలం రేపింది.
జైలులో అందరిలాగే ఉండాలని అధికారులు స్పష్టం చేసినా, తనకు మాత్రం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అనంతబాబు పట్టుబట్టినట్లు సమాచారం. వైసీపీ హయాంలో జైలు అధికారులతో ఉన్న పాత పరిచయాలను వాడుకుంటూ, జైలు సిబ్బందిపై రుబాబు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక సాధారణ ఖైదీలా కాకుండా, విలాసవంతమైన సదుపాయాలు కావాలని ఆయన అధికారులను వేధించినట్లు తెలుస్తోంది. అనంతబాబు డిమాండ్లపై జైలు అధికారులు స్పందిస్తూ ఘాటుగానే ఆన్సర్ ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సదుపాయాలు కల్పించలేమని, ఒకవేళ మీకు ప్రత్యేక వసతులు కావాలంటే కోర్టు నుంచి అనుమతి పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, తన పాత పరిచయాలతో సిబ్బందిని ఒత్తిడికి గురిచేశారని సమాచారం. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో జైలు నిబంధనలను కూడా బేఖాతరు చేస్తూ ఆయన చేసిన హల్చల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా జైలు నిబంధనలను అతిక్రమించడం ఆయన నైజానికి అద్దం పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని కోర్టులు మొత్తుకుంటున్నా, ఎమ్మెల్సీ హోదా ఉందన్న గర్వంతో వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకోవడం దారుణం అని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.








