చంద్రబాబునాయుడుకు పలు సంఘాల నాయకులు కృతజ్జ్ఞతలు తెలిపారు
ఐక్యంగా కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏమీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మీరంతా సమాజంలోకి వెళ్ళి రాష్ట్రప్రభుత్వం చేసిన కృషిని వివరించాలను సూచించారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికామని అందరూ తమ బాధ్యతలను నెరవేరిస్తే ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. రాజమండ్రిలో జయహో బీసీ సభలో పలు కార్పొరేషన్ లను నెలకొల్పుతూ ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పలు సంఘాల నాయకులు కృతజ్జ్ఞతలు తెలిపారు.
సచివాలయంలో అఖిల భారత యాదవ మహాసభ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, ఏపీ ముస్లిం స్వర్ణకారుల సంఘం నేతలు, పలువురు సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ఆత్మీయ సన్మానం చేశారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి మీరు పడుతున్న తపన మరువలేనిదన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ పలు కులాలను, వర్గాలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్న పార్టీలకు భిన్నంగా టీడీపీ వ్యవహరించిందన్నారు. రాష్ట్రప్రజలకు మెరుగైన పథకాలు అమలు పరిచిన ఘనత మీదేనని ప్రశంసించారు.
ప్రథమంగా అఖిల భారత యాదవ మహాసభ ఏపీ శాఖ అధ్యక్షులు పి.ఎం. కొండయ్య యాదవ్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ వై. తులసీరాం యాదవ్, ఏపీ టీీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎన్.బాలాజీ లతోపాటు పలువురు రాష్ట్ర యాదవ వర్గ నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర యాదవ వర్గమంతా మీ గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.బీసీల్లో యాదవ వర్గానికి అత్యధిక జనాభా, చారిత్రక నేపధ్యముందని ముఖ్యమంత్రికి తెలిపారు. కొన్నేళ్ళుగా యాదవ వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పాలన్న తమ డిమాండును నెరవేర్చిన ఘనత మీదేనని ముఖ్యమంత్రిని ప్రశంసించారు. యాదవ కార్పొరేషన్ ను ప్రకటించడం చారిత్రక నిర్ణయమన్నారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కల సాకారం చేసినందుకు మీకు యావత్ యాదవ వర్గ ప్రజలు సర్వధా కృతజ్జ్ఞులై ఉంటామని హామీ ఇచ్చారు.ఎంతో ఘన చరిత్ర ఉన్న యాదవ కమ్యూనిటీ ఆర్థికంగా వెనకబడి ఉన్నందున తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగు విధంగా ప్రోత్సహించేందుకు కార్పొరేషన్ ఏర్పాటు శుభసూచకమన్నారు.
గుంటూరులో నారా హమారా, టీడీపీ హమరా సభలో రూ. 10 కోట్లు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ ముస్లిం స్వర్ణకారుల సంఘం కృతజ్జ్ఞతలు తెలిపింది. విజయవాడలో ముఖ్యమంత్రికి ఆత్మీయ మద్దతు సభ నిర్వహించినట్లు వారు తెలిపారు. ముస్లిం స్వర్ణకారులు మీవెంటే నడుస్తారని ఏపీ ముస్లిం స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రియాజ్, ప్రధాన కార్యదర్శి ఖాజావలీ, న్యాయ సలహాదారు బషీర్ అహ్మద్ లు హామీ ఇచ్చారు. గతంలో విడుదల చేసిన జీవో నెం. 272 అమలుకు శ్రద్ధ వహించాలని తద్వారా స్వర్ణకారులు పోలీసుల వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందని వారు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. విశ్వబ్రాహణ కార్పొరేషన్ కు జవజీవాలు కల్పిస్తూ నిధులు కేటాయిస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు కనకాచారి కృతజ్జ్ఞతలు తెలిపారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ లో భాగమైన మహిళా కమిటీ వెబ్ సైట్ ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
విశ్వబ్రాహ్మణ మహిళలకు ఉపయుక్తమయ్యే అంశాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి మహిళా కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి, కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. చెక్కపై చెక్కిన ఎన్టీఆర్ చిత్తర్వును సీఎంకు బహూకరించారు. ఉత్తరాంధ్రాలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతూన్న గోడె అరుణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అరుణకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.













