Manda Krishna Madiga: రాజ్యసభ రేసులో మంద కృష్ణ మాదిగ..! అన్నామలైకి ఛాన్స్ లేనట్టేనా..?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) బరిలో నిలుస్తున్నట్టు మొదట్లో బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గ నాయకుడు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది.
మంద కృష్ణ మాదిగ దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ (SC Reorganisation) కోసం పోరాడుతున్నారు. మాదిగ సామాజిక వర్గం హక్కుల కోసం గళమెత్తుతున్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయమైన ప్రభావం చూపింది. బీజేపీ (BJP) ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంద కృష్ణ మాదిగకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఆయనకు రాజకీయంగా బలం చేకూర్చాయి. మోదీ పలు సందర్భాల్లో మంద కృష్ణ మాదిగ ఉద్యమాన్ని ప్రశంసించడం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడడం బీజేపీతో ఆయన సంబంధాలను బలోపేతం చేసింది.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ (TDP) కూడా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను జారీ చేసి, దాన్ని అమలు చేస్తూ మాదిగ సామాజిక వర్గం మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ రెండూ మంద కృష్ణ మాదిగ వైపు మొగ్గు చూపుతున్నాయనే చర్చ జోరందుకుంది. రాజ్యసభ స్థానాన్ని (Rajyasabha Seat) మంద కృష్ణ మాదిగకు కేటాయిస్తే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటంతో పాటు ఎస్సీ సామాజిక వర్గాల్లో మద్దతు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నామలై తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు రాజ్యసభ స్థానం కేటాయిస్తే దక్షిణ భారతంలో బీజేపీ ప్రభావం పెరుగుతుందనే ఆలోచన మొదట వెల్లడైంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో స్థానిక నాయకుడైన మంద కృష్ణ మాదిగకు ఈ సీటు ఇవ్వడం ద్వారా బీజేపీకి స్థానికంగా ఎక్కువ లాభం చేకూరుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మాదిగ సామాజిక వర్గం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
రాజ్యసభ స్థానం కోసం బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంటే, మంద కృష్ణ మాదిగకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా మంద కృష్ణ మాదిగ సామాజిక రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఆయనకు రాజ్యసభ స్థానం కేటాయిస్తే ఎన్డీఏ కూటమికి రాజకీయ లాభం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ఢిల్లీలో అమిత్ షాతో (Amit shah) పాటు చంద్రబాబును కూడా మంద కృష్ణ మాదిగ కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.













