పూడి శ్రీహరికి బెయిల్, కోర్ట్ కీలక ఆదేశాలు..!
వైసీపీ సోషల్ మీడియా విభాగం కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) సీపీఆర్ఓ (CPRO) పూడి శ్రీహరికి వరుస అరెస్టుల పర్వంలో గుంటూరు కోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనితో పాటు, శ్రీహరిని నేరుగా అరెస్ట్ చేయకుండా ముందుగా 41-ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
అసలు ఈ వివాదం కుప్పం కేసుతో మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేశారనే ఫిర్యాదుతో కుప్పం పోలీసులు గత బుధవారం బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, గురువారం కుప్పం కోర్టులో ఆయనకు బెయిల్ లభించింది. ఆయన విడుదలవుతున్న సమయంలోనే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు రంగంలోకి దిగి శ్రీహరిని తమ కస్టడీలోకి తీసుకుని గుంటూరుకు తరలించారు.
కొత్తపేట పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత మూడు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. అంతకుముందు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరటనిచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఆయనను నోటీసుల ద్వారా మాత్రమే విచారణకు పిలవాల్సి ఉంటుంది. ఈ అరెస్టులు మరియు కోర్టు తీర్పులు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. పూడి శ్రీహరికి ఏపీ హైకోర్టులో(High Court) భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్ట్ ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో శ్రీహరిని నేరుగా అరెస్ట్ చేయకుండా, చట్టపరమైన 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో వరుసగా కుప్పం మరియు గుంటూరు కొత్తపేట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఊరట కలిగించాయనే చెప్పాలి.








