14న జనసేనాని తొలి జాబితా?
రాజకీయ ప్రక్షాళనకోసం నడుంబిగించిన జనసేనాని పవన్కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు పూర్తిచేసుకుని 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెనిఫెస్టోతో పాటు తొలి జాబితాను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభా వేదికపైనుంచే జనసేనాని 2019 ఎన్కిల సమర శంఖాన్ని పూరించనున్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీని వేసి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేశారు. తుది జాబితాను కమిటీ రూపొందించి అధినేత ఆమోదానికి సిద్ధం చేస్తోంది.
అయితే, టీడీపీ అన్నదాత సుఖీభవ, వైకాపా రైతుభరోసా పథకాలకు ధీటుగా జనసేనాని ఎకరాకు రూ.8 వేలు ఇస్తామని ప్రకటించి సంచలనానికి నిలయమయ్యారు. సమాజంలో నానాటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రతకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. వీటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకొని జనసైనికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.













