రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయంపై అధికార వైసీపీ యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఇప్పటికే ఒక స్థాయిలో చిరంజీవికి, వైసీపీ ముఖ్య నాయకులకు మధ్య చర్చలు జరిగాయని సమాచారం. జనసేన పార్టీ అధినేత, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఇటీవ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టేందుకే వైసీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనకు తెరతీసిందని అధికార పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చిస్తున్నాయి. మరోవైపు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీకి సిఫారసు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు రిటైరవుతున్నారు. ఆ నాలుగు ఖాళీల భర్తీ కోసం ఈ నెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.













