బయటి వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకోండి : డీజీపీ
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరిహద్దులలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే తాము 300 వాహనాలను తిప్పి పంపామని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు తాము అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లాటూన్ల కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ బూత్ వద్ద ఏ సమస్య వచ్చినా తక్షణమే డయల్ 100 లేదా డయల్ 112 ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని డీజీపీ సూచించారు. ఉద్దేశపూర్వకంగానే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంపై ఇప్పటికే ఓ కన్నేశామని 33 వేల 966 మందిని బైండోవర్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని, అందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.













