అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి : వైఎస్ జగన్
రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్లపట్టాల పంపిణీ అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణం సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు పట్టాల పంపిణీ చేసిన అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1,085 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 5.01 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్, ఆపైన నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బేస్మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64 లక్షలు పైనే ఉన్నాయని, వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు తెలిపారు.













