అప్పటికల్లా పూర్తవ్వాలి.. గృహ నిర్మాణ శాఖకు సీఎం జగన్ డెడ్లైన్..
ఏపీ గృహ నిర్మాణ శాఖకు సీఎం జగన్ డెడ్లైన్ పెట్టారు. గురువారం అధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ ఈ సమీక్ష సందర్భంగా అధికారులను ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల పనులు సహా ఇతర నిర్మాణాల పురోగతిపై అధికారులతో జగన్ చర్చలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడూతూ.. ‘రాష్ట్రంలో సొంత గృహం లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ గృహాల నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం. ఈ నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలి. లే అవుట్లో పర్యటించడం ద్వారా జరుగుతున్న పనుల పురోగతిని గమనిస్తూ వాటిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలు లభిస్తోంది. ఎప్పటికప్పుడు లేఅవుట్లలను, అక్కడ జరుగుతున్న పనులను సందర్శంచినట్లుగా ఫొటోలు అప్లోడ్ చేయాలి’ అని జగన్ అధికారులకు ఆదేశించారు. అయితే తాము ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నానమి, ఆ రోజున తప్పకుండా లేఅవుట్లను సందర్శిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ పనులన్నింటినీ అనుకున్న సమయానికల్లా పూర్తి చేయాలని, ఆప్షన్-3 ఎంచుకున్న లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు సందర్శించడం ద్వారా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించగలుగుతామని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి ప్రతి ఇంట్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని, ఇతర మౌలిక సదుపాయాలనూ అందిస్తూ ముందుకు సాగాలని వెల్లడించారు.













