నూతన పారిశ్రామిక పాలసీ విడుదల చేసిన ఏపీ…
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృధ్ది కోసం కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి రూపకల్పన చేశారు. ఈ కొత్త పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాలు సోమవారం విడుదల చేశారు. ఈ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో ప్రాధాన్యత ఇచ్చారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీలు కల్పించనున్నారు. విధానాల అమలులో పారదర్శకతతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.ఈ కొత్త పారిశ్రామిక పాలసీ 2020-2023 వరకు అమలులో ఉంటుంది.
సంపద సృష్టించే దిశగా..
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించేలా వైఎస్సార్ వన్ పేరిట కొత్త విధానం తెచ్చామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ సందర్బంగా చెప్పారు. పరిశ్రమలకు నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం ఉన్న యువతను నూతన విధానం చేరువ చేస్తుందని తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం గడువు ఈ ఏడాది మార్చితో పూర్తయ్యిందని ఆ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోను సాధ్యం కాదన్నారు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో నూతన పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్ల వరకే రూపొందించామని వివరించారు.













