డోలీ మోతలకు ముగింపు పలకడమే తమ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సంధ్యారాణి
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani) తెలిపారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో రెండేళ్ల ప్రగతిపై సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గిరిశిఖర గ్రామాల్లో దారి లేని చోట్ల మట్టి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లాలోనే ఫార్మేషన్ రోడ్ల కోసం రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు ముగింపు పలకడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాల (Anganwadi centers)కు ఈ నెల 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు దశలవారీగా ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ చేపట్టామని, దీనివల్ల ఇంధన పొదుపు, పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. తొలి విడతలో 11,400 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. మెగా డీఎస్సీ (DSC)లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వారి రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాలు వచ్చాయని అలా చేయడం తప్పంటారా అని జగన్‌ను ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి క్రీడా కోటాలో పోస్టులిచ్చారని వైసీపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు.








