ఏపీలో పాఠశాలల ప్రారంభం 5నుంచి.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడంతో విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను అధికారులు సిద్దం చేశారు.
కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలు మూసివేయడంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించినప్పటికీ… ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం క్లాసులు ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ… లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈనెల 31వ తేదీ వరకు పాఠశాలలను ప్రారంభించకూడదని కేంద్ర ఆదేశాలు ఉన్నాయని దీంతో సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభమవుతాయని జగన్ చెప్పారన్నారు. అయితే ఈ నెల 31 తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా నాడు-నేడు పనులను పూర్తి చేసి స్కూళ్లను ప్రారంభించాలనేది తమ ఆలోచన అని చెప్పారు. ఓ వైపు సెప్టెంబరు 5 అని ప్రకటించినప్పటికీ.. 31వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని మంత్రి చెప్పడంతో… కరోనా నియంత్రణలోకి రాకపోతే స్కూళ్లు ప్రారంభం సందేహాస్పదంగానే మారింది.













