గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష… డిసెంబరు కల్లా
డిసెంబరు కల్లా 1,10,672 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే మార్చి కల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్కు తెలిపారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించామని, మార్చి లోపు మిగిలిన ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్`1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని సీఎంకు వివరించారు.
టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెయ్యి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామన్నారు. విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు సీఎం వివరించారు.













