అమెరికా అధ్యక్ష అభ్యర్థి భద్రతలో లోపాలు…
పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా పేలిన తుపాకీ.. దేశ రాజకీయాల్లో భద్రతపై దశాబ్దాలుగా ఉన్న భరోసాను నేలమట్టం చేసింది. 1981లో రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిని గానీ లక్ష్యంగా చేసుకున్న సందర్భమేదీ లేదు. తాజా దాడితో.. అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో లోపాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతోపాటు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత ‘యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్’ది. ఇది సుశిక్షిత భద్రతా విభాగం. ప్రస్తుత అధ్యక్షుడితో పోలిస్తే మాజీకి భద్రత కాస్త తక్కువగానే ఉంటుంది. అయినా పటిష్ఠంగానే ఉంటుంది. తాజా మాజీ అధ్యక్షుడికి దాదాపు 75 మంది సిబ్బంది 24 గంటల పాటు రక్షణగా ఉంటారు. ఆయన సందర్శించే ప్రదేశాలను సీక్రెట్ సర్వీస్ అధికారులు ముందే క్షుణ్నంగా తనిఖీ చేయాలి. మాజీ అధ్యక్షుడికి సమీపంలోకి వచ్చేవారి పూర్వాపరాలను ఆరా తీయాలి. జాగిలాలను మోహరించాలి.
సీక్రెట్ సర్వీస్‌లో క్లోజ్డ్ ప్రొటెక్షన్ బృందం ఉంటుంది. అవసరమైతే వీరు తమ శరీరాన్ని కవచంగా ఉపయోగించి వీఐపీని రక్షిస్తారు. వీరికితోడు కౌంటర్ అసాల్ట్ బృందం ఉంటుంది. దీని సంకేత నామం ‘హాక్ ఐ’. సమీపంలో దాడికి పాల్పడే వారిని హతమార్చడం దీని ప్రధాన విధి. అలాగే కౌంటర్ స్నైపర్ బృందం కూడా ఉంటుంది. దీని సంకేత నామం ‘హెర్క్యులస్’. ఈ బృందం సభ్యులు.. దూరంగా మాటువేసి ఉండే స్నైపర్లను మట్టుబెడతారు. వీరి వద్ద శక్తిమంతమైన బైనాక్యులర్స్, స్నైపర్ రైఫిళ్లు ఉంటాయి. వీరు సభా వేదికకు సమీపంలోని ఎత్తయిన భవనాలపై మోహరిస్తారు.
జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ఇతర మాజీ అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్.. ప్రజాజీవితంలో చురుగ్గానే ఉన్నారు. దీనికితోడు.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారు. అందువల్ల ట్రంప్ భద్రతా అవసరాలు చాలా సంక్లిష్టం. ఆ మేరకు ఆయనకు రక్షణ కల్పించడంలేదని తాజా ఉదంతం చెబుతోంది. ట్రంప్‌నకు సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచాలని పదేపదే కోరినట్లు ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ తెలిపారు. అయితే సీక్రెట్ సర్వీస్‌ను పర్యవేక్షించే అంతర్గత భద్రతా విభాగం సెక్రటరీ అలెజాండ్రో మేయర్‌కాస్ ఇందుకు నిరాకరించారని ఆరోపించారు.
ముందే హెచ్చరించినా..
పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీ వద్ద రైఫిల్‌తో ఒక వ్యక్తి సమీపంలోని భవనం పైకప్పు మీదకు ఎగబాకడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు.. పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినా సకాలంలో స్పందనలేదు. పైకప్పు మీదకు చేరిన దుండగుడు కొద్దిసేపు అక్కడే ఉన్నాడు. మరోవైపు.. ట్రంప్ ప్రసంగం కొనసాగుతూనే ఉంది. భద్రతా సిబ్బంది ఆయనను వేదిక నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లలేదు. తాము అప్రమత్తం చేసిన 3-4 నిమిషాల తర్వాత దుండగుడు కాల్పులు మొదలుపెట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
అంత దగ్గరకు ఎలా వచ్చాడు?
ట్రంప్‌పై దాడిచేసిన దుండగుడు.. వేదికకు దాదాపు 150 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిపాడు. రైఫిల్‌కు సంబంధించిన పూర్తి కిట్‌తో అతడు అంత దగ్గరగా ఎలా రాగలిగాడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అతడు ఉపయోగించిన ఏఆర్-15 తుపాకీకి 400 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ప్రభావవంతంగా ఛేదించే సామర్థ్యం ఉంది. అంటే.. ‘ప్రమాదకరమైన దూరం’ నుంచే దుండగుడు కాల్పులు జరిపాడు. రెప్పపాటు కాలంలో ట్రంప్ తల పక్కకు తిప్పకపోతే.. తూటా నేరుగా ఆయన తలలోకి దూసుకెళ్లి ఉండేది. సమీపంలోని అన్ని భవనాలపై కౌంటర్ స్నైపర్ బృందాలు ఎందుకు మోహరించలేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.






