కల్లోల మయన్మార్..
మయన్మార్ రణరంగాన్ని తలపిస్తోంది. మయన్మార్ ఆర్మీ, రెబల్ గ్రూపుల మధ్య పోరాటంతో.. మయన్మార్ లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పోరులో బలికాకుండా ఉండేందుకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని.. పొరుగున ఉన్న భారత్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. మానవతా దృక్పథం దృష్ట్యా.. వారికి భారత్ కూడా ఆశ్రయం కల్పిస్తోంది. అయితే ..ఇటీవల మయన్మార్ ఆర్మీకి చెందిన వందలమంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
మయన్మార్లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీకి కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి ప్రవేశించారు. రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో వారు ఉంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్దుహోమా (Lalduhoma).. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. ఆశ్రయం పొందేందుకు మయన్మార్ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథంతో మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం అని సమావేశం అనంతరం సీఎం మీడియాకు వెల్లడించారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మిజోరం కేంద్రాన్ని అభ్యర్థించింది.
2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి మయన్మార్ సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో త్రీబ్రదర్హుడ్ అలయన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం , టాంగ్ జాతీయ విమోచన సైన్యం, అరాకన్ ఆర్మీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.













