‘చైనా’ కష్టాలు..
ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం.. రియల్ ఎస్టేట్ డమాల్.. భారీగా పెరిగిన నిరుద్యోగిత.. తగ్గుతున్న జననాలు.. చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం చైనాను వణికిస్తోంది. ఇనుప తెరలతో దాన్ని కవర్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నా.. అది ఆగడం లేదు. ఎన్నిప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తెలియక చైనా తెగ ఇదై పోతోంది. మరోవైపు అదను చూసి అమెరికా వేస్తున్న ఆంక్షల ఉచ్చులో ఇరుక్కున్న డ్రాగన్ కంట్రీ ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంది.
చైనా ఆదాయంలో మూడో వంతు రియల్ ఎస్టేట్ నుంచే వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ డమాల్ అయింది. చైనాలోని అతిపెద్ద రియల్ కంపెనీలు.. దివాలా అంచున ఉన్నాయి. వాటిని కాపాడేందుకు చైనా సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఇందులో కొన్ని తాము దివాళా తీసినట్లు ప్రకటిస్తున్నాయి కూడా. దీంతో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతోంది. ఆదాయం కుంచించుకుపోతోంది.
చైనాలో నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరింది. దీన్ని పరిష్కరించలేని చైనా సర్కార్.. యువతను గ్రామసీమల్లో ఉపాధి చూసుకోమంటోంది. అయితే లక్షలు ఖర్చు పెట్టి మంచి చదువులుచదివిన యువత.. ఇప్పుడు వెళ్లి పల్లెల్లో ఏం చేస్తారు? దీంతో ఏం చేయాలో తెలియక యువత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తోంది. మరికొందరు తమ నిస్సహాయ స్థితిని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో వెలిబుచ్చుతున్నారు.
ఇక ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాకు యువత నుంచి సవాల్ ఎదురవుతోంది. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి ఆ దేశ యువత ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో ఆ దేశంలో జననాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. 2022లో చైనాలో ఫెర్టిలిటీ రేటు మరింత పడిపోయి 1.09 శాతంగా నమోదైంది. ఓ పక్క చైనా ప్రభుత్వం పిల్లలను కనాలంటూ జనాలను బతిమాలుతోంది. పిల్లలను కనేవారికి నజరానాలను, ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటిస్తోంది. ప్రభుత్వమే కాదు ప్రయివేట్ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అయినా సరే పిల్లలను కనేందుకు చైనీయులు సుముఖంగా లేరు.
పిల్లల సంగతి తర్వాత.. పెళ్లి చేసుకోవడానికి కూడా చైనా యువత వెనుకడుగేస్తోంది. ఆ దేశంలో పెళ్లిళ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. చైనా మ్యారేజ్ రేటు 2022లో 5.2 శాతమని అంచనా. గత 42 ఏళ్లలో ఇదే అత్యల్పం. 2013లో చైనాలో జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే.. 2022 నాటికి పెళ్లిళ్ల సంఖ్య సగానికి పడిపోయింది. పెళ్లి పట్ల సగటు చైనీయులు ఎంత విముఖంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.













