మేం పైరేట్స్ లాంటి వాళ్లమే.. ట్రంప్ వ్యాఖ్యల కలకలం..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా.. అపనింద లాంటి దాన్ని తమమీద వేసుకుంటూ ఉత్సాహంగా ప్రకటన చేసేశారు. తాము ఓ రకంగా సముద్రపు దొంగల లాంటి వాళ్లమే అన్నారు ట్రంప్. కానీ వారిలా ఆటలు ఆడడం లేదన్నారు. కొన్నిరోజుల క్రితం గల్ఫ్ సముద్రజలాల్లో ఓ నౌకను అమెరికా నావికా దళం సీజ్ చేసింది. దాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ నౌకలోని సరకును, చమురును తీసుకున్నామని, అదొక లాభదాయక వ్యాపారమని చెప్పారు.
‘‘ఇరాన్‌కి నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు లేకుండా పోయాయి. నాయకత్వం కూడా బలహీనమైంది. వాళ్లు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారు. మాకు కావాల్సిన స్థాయిలో ప్రతిపాదనలు లేవు. తుది ఒప్పందం సాధ్యమవుతుందా లేదా అన్నది తెలియడం లేదు. ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలున్నాయి. వాళ్లలో ఉన్న వర్గాలన్నీ ఒప్పందాన్ని కోరుకుంటున్నా, ఏకాభిప్రాయం లేదు. మేం ఇప్పుడు వెనక్కి తగ్గితే మరో మూడు సంవత్సరాల్లో సమస్య మళ్లీ వస్తుంది. అందుకే పూర్తి పరిష్కారం వచ్చే వరకు వెనక్కి వెళ్లం’’ అని ట్రంప్ తెలిపారు.
అవసరమైతే తీవ్రదాడులకూ సిద్ధంగా ఉన్నామని, సాధ్యమైనంత వరకు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని ఆశిస్తున్నామని ట్రంప్ తెలిపారు. మానవతా దృష్టితో చూస్తే యుద్ధం వద్దనే అనిపిస్తుందని, యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. తమ నౌకాదళం అమెరికాకు తిరిగి వస్తూ క్యూబాను కూడా స్వాధీనం చేసుకుంటుందేమోనని జోక్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ సుమారు 100 గజాల దూరంలో ఆగగానే క్యూబా వచ్చి ధన్యవాదాలు చెప్పిమరీ లొంగిపోతుందన్నారు.
సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటడానికి నౌకాయాన సంస్థలు ఇరాన్‌కు డబ్బులు చెల్లించినట్లయితే ఊరుకునేది లేదని, వాటిపై తాము ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు ‘అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం’ పోస్ట్ చేసింది. ఇప్పటికే హర్మూజ్ చుట్టుపక్కల నిలిచిపోయిన నౌకలపై ఇది మరింత ఒత్తిడి పెంచింది. టోల్‌బూత్ మాదిరి చెల్లింపులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.








