కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన కర్నాటక సీఎం పీఠం..!
కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై సందిగ్ధత కొనసాగుతోంది. బహుశా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్… ఇద్దరూ తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఇద్దరూ పార్టీని గట్టెక్కించిన వాళ్లే. సిద్ధరామయ్యతో పోల్చితే డీకే శివకుమార్ పార్టీకోసం ఎంతో త్యాగాలు చేశారు. ఆర్థికంగా ఆదుకున్నారు. అయినా డీకేకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సిద్ధరామయ్య మచ్చలేని వ్యక్తిత్వం ఆయనకు ప్లస్ పాయింట్. అందుకే ఏం చేయాలో.. ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఇంతవరకూ తేలలేదు. ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతిలో పెట్టారు. దీంతో సీన్ ఢిల్లీకి మారింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక కాంగ్రెస్ హైకమాండ్ ఇబ్బందులు పడుతోంది. కర్నాటక కాంగ్రెస్ కు ఇద్దరూ ఇద్దరే. పార్టీని కష్టకాలంలో ఆదుకున్నారు. ఇద్దరికీ ఎవరికుండే ప్రత్యేకతలు వాళ్లకున్నాయి.
సిద్ధరామయ్య సీనియర్ కాంగ్రెస్ నేత. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పని చేసారు. మచ్చలేని వ్యక్తి. అందరూ సిద్ధరామయ్యను గౌరవంతో చూస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతారు. సొంత పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా సిద్ధరామయ్య నాయకత్వాన్ని ఇష్టపడతారు. సౌమ్యుడిగా పేరొందారు. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్య వర్గీయులే. అయితే సిద్ధరామయ్య మాస్ లీడర్ కాదు. ఆర్థికంగా బలవంతుడు కాడు. తనపనేదో తాను చేసుకుపోయే రకం. డీకే శివకుమార్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం డీకేని ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. సీబీఐ, ఈడీలతో దాడులు చేయించింది. అయినా డీకే శివకుమార్ బెదరలేదు. జైలుకు వెళ్లినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఆదుకున్నారు.
డీకే శివకుమార్ అనే వ్యక్తి లేకపోతే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కనుమరుగైపోయేది. కేడర్ మొత్తం చిన్నాభిన్నమైపోయేది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా తాను ముందుండి ఎదుర్కొన్నారు. డీకే శివకుమార్ మాస్ లీడర్. లక్షకు పైగా మెజారిటీతో శివకుమార్ గెలిచారంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోనియా కుటుంబానికి వీర విధేయుడు. అయితే డీకే పైన కేసులున్నాయి. వాటిని బీజేపీ ప్రభుత్వం మళ్లీ తిరగదోడే అవకాశం ఉంది. పైగా కర్నాటక డీజీపీయే ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇదే డీకే శివకుమార్ కు పెద్ద మైనస్.
రెండు కళ్లలో ఏది ఇష్టం అంటే ఏం చెప్తాం..? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇంతే. ఇద్దరూ కావాల్సిన నేతలే.! ఎవరినీ వదులుకునే పరిస్థితి లేదు. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసినా మరొకరు కాదనరనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇద్దరు నేతలూ హైకమాండ్ మాటను జవదాటరు. తాజాగా డీకే శివకుమార్ కూడా ఇదే మాట చెప్పారు. తాను సీఎం పదవికే అర్హుడినేనని.. అయితే అది హైకమాండ్ ఇష్టమని చెప్పారు. కేసులను సాకుగా చూపించి డీకే శివకుమార్ ను పక్కన పెట్టొచ్చనే ఉహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా డీకేకు సీఎం సీటు ఇస్తే సిద్ధరామయ్య వర్గీయులు ఎక్కువ మంది వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. కానీ డీకే వర్గీయులు అధిష్టానాన్ని ధిక్కరించే మనస్తత్వం కాదు.













