ఈ విషయాలు తెలిస్తే దటీజ్ డీకే శివకుమార్ అనకుండా ఉండలేరు..!!
కర్నాటక ఎన్నికల్లో డీకే శివకుమార్ పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురొడ్డి నిలిచారాయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీఎం సీటు ఇస్తుందో లేదో తెలీదు. అందరూ సిద్ధరామయ్యే సీఎం అని చెప్తున్నారు. దీంతో డీకే శివకుమార్ కు మరోసారి మొండిచేయేననే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా తాను వెన్నుపోటు పొడవనని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు.
డీకే శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ కు ఆయువుపట్టు లాంటి నేత. వాస్తవానికి పార్టీ తనకు చేసిన మేలు కంటే తన వల్లే పార్టీకి ఎక్కువ లబ్ది చేకూరింది. వ్యాపారవేత్త అయిన డీకే.. రాజకీయాల్లోకి వచ్చి ఎంతో నష్టపోయారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. అక్రమాస్తుల ఆరోపణలు చేస్తూ జైలుకు పంపించింది. అయినా ఎక్కడా బెదరలేదు.. అదరలేదు. మిగిలిన చాలా మంది నేతల్లాగే తాను కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి ఉంటే తనపై కేసులు ఉండేవి కావు. ఆ విషయం డీకే శివకుమార్ కు కూడా తెలుసు. కానీ తాను ఆ పని చేయలేదు. ఇది డీకే నిబద్దతకు ప్రతీక.
డీకే శివకుమార్ అవినీతికి పాల్పడ్డాడో లేదో తెలీదు. కానీ తనపై కేసులున్నాయి. ఇప్పుడు ఇదే ఆయన పదవికి పెద్ద ఆటంకంగా మారింది. సీఎం సీటులో కూర్చోబెడితే ఎప్పుడైనా ఆ పదవి నుంచి దించేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ భయపడుతోంది. కానీ డీకే శివకుమార్ మాత్రం భయపడట్లేదు. ఇలాంటివి ఎన్ని వచ్చినా తాను చూసుకుంటానని చెప్తున్నారు. ఇది డీకే మొండితనానికి చిహ్నం. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్తుంటారు. ఇప్పుడు డీకే కూడా అంతే.
డీకేని చాలా మంది ఆవేశపరుడని చెప్తుంటారు. కానీ ఆ ఆవేశమే ఆయన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. తన పార్టీకి, కేడర్ కు ఎక్కడైనా ఏదైనా అపాయం జరిగిందని తెలిస్తే అక్కడ వాలిపోతుంటారు డీకే. అందుకే ఆయన పార్టీని కన్నబిడ్డలా కాపాడుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు కాకపోయినా డీకే పనితీరు ఇలాగే ఉండేది. అందుకే నేటి తరం నేతలంతా డీకే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
సొంతపార్టీ నేతలకే కాదు.. ఇతరులతోనూ సన్నిహిత సంబంధాలు నెరపడే డీకేకు అలవాటు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆఫర్ చేసి బీజేపీకి చెక్ పెట్టారు డీకే. అనువుగాని చోట కాస్త తగ్గేందుకు కూడా డీకే వెనుకాడరు. తాజా ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్ రామనగర స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రచారం చివరి రోజు డీకే శివకుమార్ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ తరపున అక్కడే ప్రచారం చేశారు. అక్కడ నిఖిల్ పై ఇక్బాల్ హుస్సేన్ గెలిచారు. ఇవాళ నిఖిల్ కు డీకే శివకుమార్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అదే నియోజకవర్గంలో తిరిగి సత్తా చాటాలని సూచించారు. మీ ఇంటి నుంచి ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి అయ్యారని, నీకు కూడా మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఇలా ప్రత్యర్థుల మనసులను సైతం గెలుచుకోగల సత్తా డీకేకు ఉంది.













