అమాంతంగా పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్..! ఎటు చూసినా హస్తం జపమే..!!
బండ్లు ఓడలు కావచ్చు.. ఓడలు బండ్లు కావచ్చు.. అనేది సామెత. ఎప్పుడు ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేం. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. రాజకీయాల్లో మరీనూ..! ఒక్క ఓటుతో రాజకీయ నేతల తలరాతలు మారిపోతుంటాయి. పార్టీల భవిష్యత్తు అమాంతం తిరిగిపోతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. వందేళ్ల కాంగ్రెస్ వరుస ఓటములతో ఆపసోపాలు పడుతోంది. ఆ పార్టీని గట్టెక్కించే నాథుడు లేక దిక్కులు చూసింది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ జపమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది..
కర్నాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో గొప్ప జోష్ తీసుకొచ్చాయి. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అమాంతం పెరిగిపోయింది. అందరూ ఆ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఒప్పుకుంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జపమే నడుస్తోంది. బీజేపీయేతర పక్షాలన్నీ కాంగ్రెస్ కు మాత్రమే బీజేపీని ఓడించే సత్తా ఉందని ఘంటాపథంగా చెప్తున్నాయి.
నిన్నటివరకూ కాంగ్రెస్ తో కలిసేదే లేదన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీ.. ఇప్పుడు అవసరమైతే ఆ పార్టీతో కలిసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకునేందుకు, అవసరమైనచోట కాస్త తగ్గేందుకు కాంగ్రెస్ సిద్ధమైతే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీపైన, రాహుల్ గాంధీ సత్తా పైన జోకులు, సెటైర్లు పేల్చిన నేతలు సైతం ఇప్పుడు పొగుడుతున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్తున్నారు.
రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఈసడించుకున్న ఎన్నో పార్టీలు ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నాయి. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ తో కలసి నడవడమే మంచిదనుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని భావించి ఇతర పార్టీల్లోకి వెళ్లాలనుకున్న నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు భారీగా ఉంటాయనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. బీఆర్ఎస్, బీజేపీల్లో చేరాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది చాలు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగిందో..!!













