టార్గెట్ హ్యాట్రిక్ .. 400 సీట్లే లక్ష్యం..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార బీజేపీ.. ఆపరేషన్ సర్కార్ మొదలు పెట్టేసింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 లో ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ సొంతంగా 282 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. అదే 2019 లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు సాధించింది. ఈ క్రమంలోనే ఈసారి 400 సీట్లను దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో గెలిచిన ఇతర పార్టీల ఎంపీలను కాషాయ పార్టీలో చేర్పించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఆ స్థానాలపై కీలకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుని ఆ స్థానాలను కూడా బీజేపీ ఖాతాలో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1984 లో 400 కు పైగా స్థానాలను గెలిచి రికార్డ్ సృష్టించింది. అయితే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి ఉన్నా 400 ల సీట్ల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమలోనే వచ్చే ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా … పార్టీలోని కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి జాయినింగ్ కమిటీ బాధ్యతలు ఇచ్చారు. ఈ కమిటీ ఇతర పార్టీల్లోని ప్రభావవంతమైన నాయకులను, ఇతర సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కాషాయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతకు ఉన్న ఫాలోయింగ్.. ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనే అంశాల ఆధారంగా ఆ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇక….2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేసే బాధ్యతను బీజేపీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు కట్టబెట్టారు. ఎన్నికల ప్రచారం, ఇతర సంబంధిత పనులను సునీల్ బన్సాల్, ఇతర కార్యదర్శులు చూసుకుంటారని తెలిపారు.













