అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. స్పందించిన భారత్
US-Iran: దాదాపు 40 రోజులుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య భీకర పోరుకు తెరపడింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని భారత ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతించింది. ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి పునాది వేస్తుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది.
దౌత్యానికే భారత్ మొగ్గు:
ఉద్రిక్తతలు తగ్గించుకుని, నిరంతర చర్చలు , దౌత్య మార్గాల ద్వారానే ఈ రకమైన అంతర్జాతీయ సంఘర్షణలకు పరిష్కారం లభిస్తుందని భారత్ మొదటి నుండి చెబుతోంది. ఈ యుద్ధం వల్ల అటు ప్రాణనష్టం జరగడమే కాకుండా, ప్రపంచ ఇంధన సరఫరా , అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగిందని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ:
తాజా ఒప్పందంతో హర్మూజ్ జలసంధి మీదుగా అంతర్జాతీయ నౌకల రవాణా మళ్లీ సజావుగా సాగుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణను ప్రకటించగా, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ కీలక పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.








