రావు బహదూర్‌కు భారీ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్..
సత్యదేవ్(Satyadev) ప్రధాన పాత్రలో తెరకెక్కిన రావు బహదూర్(Rao Bahadur) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అండగా నిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వివిధ ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు విడుదల చేయనున్నాయి.
తెలంగాణలోని నిజాం ఏరియా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు సీడెడ్ ఏరియాల రిలీజ్ బాధ్యతలను ధీరజ్ సినిమాస్ స్వీకరించింది. ఇక కర్ణాటకలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనుండటం విశేషం. తమిళనాడు హక్కులను థింక్ స్టూడియోస్ సొంతం చేసుకోగా, విదేశీ మార్కెట్లో అథర్వణ గ్లోబల్ ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివిధ కీలక మార్కెట్లలో పేరున్న డిస్ట్రిబ్యూటర్లు రావు బహదూర్ కు అండగా నిలవడం సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. కంటెంట్‌పై విశ్వాసంతోనే ఈ స్థాయి సంస్థలు ముందుకు వచ్చినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన థియేట్రికల్ రిలీజ్ ప్లాన్‌తో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకులను చేరుకునేందుకు రావు బహదూర్ సిద్ధమవుతుండగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.








