Forex Reserves: భారీగా పుంజుకున్న ఫారెక్స్ నిల్వలు.. 9 బిలియన్ డాలర్లు జంప్!
కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన భారత విదేశీ మారక ద్రవ్య (Forex Reserves) నిల్వలు మళ్లీ అనూహ్యంగా పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారానికి సంబంధించిన తాజా గణాంకాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, దేశ ఫారెక్స్ నిల్వలు ఒకే వారంలో 9.06 బిలియన్ డాలర్ల మేర పెరిగి, మొత్తం 697.121 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 57.86 లక్షల కోట్లు కావడం గమనార్హం. కాగా, సరిగ్గా దీనికి ముందు వారం (మార్చి 27తో ముగిసిన వారం)లో ఈ నిల్వలు 10.288 బిలియన్ డాలర్లు పతనమై 688.058 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే.
నిల్వల పెరగడానికి కారణాలు..
ఈ వారంలో నిల్వలు ఇంతలా పెరగడానికి ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, పసిడి నిల్వలు విశేషంగా దోహదపడ్డాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA): తాజాగా ముగిసిన వారంలో ఇవి (Forex Reserves) 1.784 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 552.856 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
బంగారం నిల్వలు: పసిడి నిల్వల విలువ ఏకంగా 7.221 బిలియన్ డాలర్ల మేర జంప్ చేసి మొత్తం 120.742 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.
ఎస్డీఆర్ & ఐఎంఎఫ్ (SDR & IMF): స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) విలువ స్వల్పంగా 58 మిలియన్ డాలర్లు పెరిగి 18.707 బిలియన్ డాలర్ల వద్ద నమోదు కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద ఉన్న భారత నిల్వలు దాదాపు ఎలాంటి మార్పు లేకుండా 4.816 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
రూపాయికి ఆర్బీఐ అండ
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కొద్ది రోజులుగా భారతీయ కరెన్సీ (రూపాయి) విలువపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అయితే రూపాయి విలువ మరింత పడిపోకుండా (Forex Reserves) నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్బీఐ విదేశీ మారక మార్కెట్లో డాలర్లను విక్రయించడం ద్వారా వ్యూహాత్మకంగా జోక్యం చేసుకుంటోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికి పలు విధానపరమైన, పటిష్ట చర్యలను కూడా అమలు చేస్తోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండేలా చర్యలు చేపడుతోంది.







