ఐపీఎల్ 2026 లో భువీ విశ్వరూపం..!
భారత జాతీయ సెలక్షన్ కమిటీ టీ20 ఫార్మాట్లో భువనేశ్వర్ కుమార్‌ను(Bhuvaneswar Kumar) పక్కన పెట్టినప్పటికీ, ఈ ‘స్వింగ్ కింగ్’ ఐపీఎల్(IPL) 2026లో తన గణాంకాలతో సరికొత్త తిరుగుబాటు చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న భువీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో(DC) జరిగిన మ్యాచ్‌లో కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. తన మొదటి మూడు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. 2022లో చివరిసారిగా భారత్ తరపున ఆడిన భువీ, 36 ఏళ్ల వయసులోనూ పవర్ ప్లేలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అని నిరూపించుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
భువనేశ్వర్ కుమార్ ప్రభావం ఎంత ఉందనేది పవర్ ప్లే గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. 2023 నుంచి ఐపీఎల్లో మొదటి ఆరు ఓవర్లలో వికెట్లు తీయడంలో భువీని మించిన వారు లేరు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టి, ఆర్సీబీకి కీలక బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ న్యూ బాల్ బౌలర్‌గా పేరున్న ట్రెంట్ బౌల్ట్‌తో సమానంగా 32 పవర్ ప్లే వికెట్లతో (2023 నుంచి) భువీ అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. సిరాజ్, షమీ, అర్ష్‌దీప్ వంటి కుర్రాళ్ల కంటే భువీయే పైచేయి సాధిస్తున్నాడు.
చిన్నస్వామి లేదా రాజీవ్ గాంధీ స్టేడియం వంటి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై కూడా భువీ ఈ స్థాయిలో రాణించడం అద్భుతం. ప్రస్తుత ఫామ్‌లోనే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే భువీ ఒక లెజెండ్‌గా నిలిచిపోతున్నాడు. ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని దాటిన తొలి భారత పేసర్‌గా రికార్డు సృష్టించిన భువీ, ప్రస్తుతం 212 వికెట్లతో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. బుమ్రా (25) తర్వాత అత్యధికంగా 20 సార్లు మూడు వికెట్ల హాల్స్ సాధించిన ఘనత కూడా భువీ సొంతం.








