ప్రధానమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 10న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (K. Ramakrishna Rao) ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడమేకాక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ (Secunderabad Parade Ground) లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. బేగంపేట్ విమానాశ్రయం (Begumpet Airport), హెలిప్యాడ్లతోపాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని ఫైర్ సర్వీసెస్ అధికారులను, అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కాన్వాయ్ పర్యటించే మార్గాలలో రోడ్లను పరిశీలించాలని, ఏవైనా మరమ్మతులు ఉంటే యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని పోలీసు, జీహెచఎంసీ, రోడ్లు, భవనాల శాఖల అధికారులను, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, దానకిషోర్, వాణిప్రసాద్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్, సుమతి, ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ లు సృజన, వినయ్ కృష్ణారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








