వైభవంగా సీతారామచంద్ర కల్యాణం
శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ఆద్యంతం రమణీయంగా సాగింది. వేదమంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైన వేడుకలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తొలుత సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య లోక కల్యాణార్థం సీతారామ కల్యాణాన్ని నిర్వహించిన తీరుకు భక్తులు బ్రహ్మరథం పట్టారు. కల్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని వివరిస్తూ ఉత్సవాన్ని కొనసాగించారు. లోకకల్యాణం కోసం ఉపయోగిస్తున్న పెళ్లి సామగ్రికి పుణ్యహవచనం చేసి సంప్రోక్షణాదులు జరిపిపారు. అభిజిత్ లగ్నం సమీపిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వధూవరులైన సీతారామ శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మంగళశాయిద్యాలు, మంత్రోచ్చరణలు మిన్నంటుతుండగా భక్తుల జయజయధ్యానాల మధ్య మాంగల్యధారణ జరిగింది. అనంతరం ముత్యాల తలంబ్రాల వేడుక భక్తులను పరమానందభరితుల్ని చేసింది.













