తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్!
తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేవలం ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, అంతర్జాతీయ పరిణామాలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటి సాంకేతిక కారణాలను చూపుతూ ఈ పెంపునకు అడుగులు పడుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో 2023 మే నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా ధరలు పెరిగాయి. ఆ లెక్కన 2025లోనే ధరల సవరణ జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ, ఇతర కారణాల వల్ల దానిని వాయిదా వేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు డిస్టలరీల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ప్రస్తుతం మద్యం ధరల పెంపునకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. మద్యం సీసాల తయారీకి గ్యాస్ వినియోగం తప్పనిసరి. గ్యాస్ ధరలు పెరగడంతో బాటిళ్ల తయారీ వ్యయం భారంగా మారిందని కంపెనీలు వాదిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం మరో కారమం. ముడిసరకుల ధరలు, రవాణా ఛార్జీలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ధరలకు మద్యం సరఫరా చేయడం గిట్టుబాటు కావడం లేదని డిస్టలరీలు ప్రభుత్వం ముందు మొరపెట్టుకున్నాయి.
ధరల నిర్ధారణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వచ్చే వారం భేటీ అయి డిస్టలరీల ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై సుమారు 60 రూపాయల వరకు పెరుగుదల ఉండొచ్చు. ప్రీమియం బ్రాండ్లు వంద రూపాయల వరకు, టాప్ ఎండ్ కేటగిరీ బాటిళ్లపై 120 రూపాయలకు పైగా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ధరల పెంపు వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇంతకుమించిన మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ధరల సవరణ ద్వారా నెలకు సుమారు 250 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది. అంటే ఏడాదికి దాదాపు 3వేల కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ఖజానాకు చేరతాయని అంచనా. ఇది సంక్షేమ పథకాల అమలుకు ఆసరాగా నిలుస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు గ్యారంటీల అమలు కోసం నిధుల వేటలో ఉన్న ప్రభుత్వానికి ఈ ధరల పెంపు ఊపిరి పోయనుంది. అయితే, అంతర్జాతీయ ఇంధన ధరల సాకుతో సామాన్యుడిపై భారం వేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు కూడా వస్తున్నాయి. మద్యం తయారీ కంపెనీల లాభాల కోసం, ప్రభుత్వ ఆదాయం కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. వచ్చే వారంలో జరగబోయే కమిటీ సమావేశం తర్వాత దీనిపై అధికారికంగా స్పష్టత రానుంది. ఏది ఏమైనా, ఈ నెలలోనే మద్యం ధరల మోత ఖాయమని స్పష్టమవుతోంది.








