ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
హైదరాబాద్‌లో హన్మాన్ జయంతి శోభయాత్ర కన్నుల పండుగగా ప్రారంభమైంది. వేలాదిమంది హన్మాన్ భక్తులు జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ నినాదాలతో శోభయాత్ర ప్రారంభించారు. గౌలిగూడ రామమందిరంలో ముందుగా శ్రీనాథపీఠ మహారాష్ట్రకు చెందిన జితేంద్రనాథ్ జీ, మహారాజ్, భజరంగ్‌దళ్ అఖిల భారతీయ అధ్యక్షుడు మనోజ్శర్మలు హన్మాన్జీకి ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్రకు జంట నగరాల నుంచి వేలాది మంది హన్మాన్ భక్తులు ర్యాలీలుగా తరలివచ్చారు. జంట నగరాలకు చెందిన హిందీనగర్, స్వామివివేకనందనగర్, ఆర్యనగర్, విద్యానగర్, మహంకాళినగర్, అణుశక్తి, విశ్వకర్మనగర్, వాయుప్తునగర్ జిల్లాలతోపాటు పాతబస్తీలోని దూల్‌పేట, బేగంబజార్, మగళహాట్, పురానాపుల్, షాలిబండ, చార్మినార్, బహుదూర్‌పురా, అత్తాపూర్‌తోపాటు, జాంబాగ్, గన్ఫాండ్రి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది హన్మాన్భక్తులు బైక్‌ర్యాలీలు నిర్వహిస్తూ జై.శ్రీరామ్ నినాదాలు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ర్యాలీలతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌలిగూడ రామమందిరం ప్రధాన రహదారి నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. పుత్లీబౌలి చౌరస్తా, ఆంధ్రా బ్యాంకు చౌరస్తా మీదుగా కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి నుంచి తాడ్‌బండ్ హన్మాన్ ఆలయానికి తరలివెళ్లింది.













