టార్గెట్ కేసీఆర్
మోడీ ఇమేజ్ కారణంగా.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా పార్టీ విస్తరిస్తున్న వేళ.. ఇప్పుడుకాకుంటే ఎప్పటికీ కాదన్న రీతిలో వారు తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో కమలనాథులు మాంచి ఉత్సాహంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తేలిగ్గా ఎదుర్కోగలమన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని తపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికల్ని రూపొందించి మరీ కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు. మోడీ గాలి తెలంగాణలో బ్రహ్మండంగా వీస్తుందని.. ఆయన పేరు చెప్పినంతనే తెలంగాణలో ఓట్లు రాలతాయన్నట్లుగా కమలనాథుల ఆలోచనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో లోక్ సభా నియోజకవర్గ స్తాయి పోలింగ్ బూత్ కమిటీ సదస్సులో మాట్లాడిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఎగరవేయటం ఖాయమన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.













