తెలంగాణపై పట్టు బిగిస్తున్న అమిత్ షా
తెలంగాణలో అధికారం చేక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పావులు కదుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంలో పార్టీ కూడా ముఖ్యమైన పాత్రను వహించినప్పటికీ తెలంగాణలో పార్టీ ఎందుకు బలంగా ఉండటం లేదో గమనించారు. పార్టీని బలపరిచేందుకు తెలంగాణలో పర్యటించాలని భావించారు. అందుకు అనుగుణంగానే మే మూడోవారంలో మూడు రోజుల పాటు తెలంగాణలో ఆయన గడపనున్నారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనతో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. ఈ నెల 7న జరగాల్సిన పర్యటన పార్లమెంటు సమావేశాలు, ఎన్డీఏ పార్టీల భేటీ కారణంగా రద్దుయిన విషయం విదితమే. ఒడిశాలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడి సమావేశ పర్యటన తేదీలు, షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. భాజపా రాష్ట్ర పదాధికారుల (కోర్‌కమిటి) సమావేశంలో అమిత్ షా పర్యటన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు చర్యలపై చర్చించారు. మతపరమైన రిజర్వేషన్లపై పెద్దఎత్తున నిరసనకార్యక్రమాలు చేపట్టాలని, శాసనసభలోనూ ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటు బూత్‌స్థాయి కార్యక్రమాలు సమీక్షించినట్లు భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు.
ఈనెలాఖరులోగా మిగతా పార్లమెంటు బూత్‌స్థాయి కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహిస్తామని, మంత్రులు, అనంత్‌కుమార్, నిర్మలా సీతారామన్, జాతీయ నాయకులు వచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 17 నుంచి దీర్ఘకాల పోరాట కార్యక్రమాలు కొనసాగుతాయని, ఈనెల 17న జిల్లా కలెక్టరేట్లు, 20న మండల కార్యాలాయాల ముట్టడి, ధర్నాలు నిర్వహిస్తామన్నారు.













