YSRCP: ఢిల్లీలో ప్రాభవం కోల్పోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..!?
వైఎస్సార్ (YSR) కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, ఓదార్పుయాత్రకు అంగీకరించలేదనే కోపంతో జగన్ సొంత పార్టీ పెట్టారు. 2009లో ప్రారంభమైన ఆ పార్టీ 2014లో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 2019లో అధికారంలోకి వచ్చింది. 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 2019 ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది. దాంతో ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశం కలిగింది. అయితే అదంతా గతం. ఇప్పడు ఆ పార్టీ ఉనికి కోల్పోయే దశలో ఉంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా తర్వాత ఆ పార్టీకి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అన్నీతానై వ్యవహరించారు విజయసాయి రెడ్డి. జగన్ ఆదేశాలను తు.చ.తప్పకుండా పనులన్నింటినీ చక్కబెట్టేవారు. విజయసాయి రెడ్డి(Vijay Sai Reddy)కి ఢిల్లీలో ఉన్న పరిచయాలే ఇందుకు కారణం. అయితే దాదాపు ముడేళ్లుగా విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టారు. మిథున్ రెడ్డికి అత్యదిక ప్రయారిటీ ఇస్తున్నారు. సాయిరెడ్డి కూడా తనకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. బీజేపీ నేతలతో తన వ్యక్తిగత ఇమేజ్ ను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పగలిగే వ్యక్తి అవసరం జగన్ కు చాలా ఉంది. ఇలాంటప్పుడు విజయ సాయి రెడ్డి రాజీనామా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
మరోవైపు వైసీపీకి కొంతకాలం కిందటి వరకూ రాజ్యసభలో 11 మంది సభ్యులుండేవారు. అయితే ఈ మధ్యకాలంలో ముగ్గురు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలు చేసి టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఈ స్థానాలను ఆ పార్టీలు కైవసం చేసుకోవడంతో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీ బలం 7కు చేరుకుంది. త్వరలోనే మరో ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే రాజ్యసభలో వైసీపీ సంఖ్య మరింత పడిపోనుంది. ఎవరు రాజీనామా చేసినా ఆ సీట్లన్నీ కూటమికో దక్కుతాయి. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదు.
పార్టీ ఓడిపోయిన కష్టాల్లో ఉంది. మరోవైపు కీలకమైన కేసులు వెంటాడుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో కదలిక వచ్చింది. వీటి విచారణ పూర్తయితే పార్టీ అగ్రనేతలకు సైతం ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీని గట్టెక్కించగలక సమర్థవంతమైన నేత అవసరం ఢిల్లీలో ఉంది. ఇన్నాళ్లూ ఆ బాధ్యతలను విజయసాయి రెడ్డి పక్కాగా డీల్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి లేకుండా పోయారు. దీంతో ఢిల్లీలో వైసీపీ ప్రభావం కోల్పోయినట్లు అవుతోంది. మరి ఈ వ్యవహారాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.













