Jagan – Vijaya Sai: విజయసాయి రెడ్డిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై (Vijayasai Reddy) వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి (NDA) ప్రలోభాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. మూడున్నర సంవత్సరాల టర్మ్ మిగిలి ఉండగానే విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం, కూటమికి మేలు చేయడానికే అని జగన్ అన్నారు. తన రాజ్యసభ సీటును విజయసాయి రెడ్డి అమ్మేసుకున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
విజయసాయి రెడ్డి, వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నెంబర్ టూ గా గుర్తింపు పొందిన వ్యక్తి. 2016లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, 2022లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాది జనవరి 25న ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను చైర్మన్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా వ్యక్తిగత కారణాల వల్లేనని, ఎలాంటి ఒత్తిళ్లు లేదా ప్రలోభాలకు లొంగలేదని పేర్కొన్నారు. అంతేకాక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అప్పట్లో వైసీపీ కూడా విజయసాయి రెడ్డి రాజీనామాను పెద్దగా పట్టించుకోలేదు.
అయితే.. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక కూటమి ప్రలోభాలు ఉన్నాయని జగన్ వెల్లడించారు. “విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి స్టేట్‌మెంట్లకు ఏ విలువ ఉంటుంది?” అని జగన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయి. లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే లిక్కర్ స్కాం కేసులో పలువురు నిందితుల పేర్లు బయటకిచ్చాయనే ఆరోపణలున్నాయి. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
విజయసాయి రెడ్డికి జగన్‌తో మూడు దశాబ్దాల సన్నిహిత అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబంతో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పాత్రధారిగా ఉన్నారు. సీబీఐ, ఈడీలు ఆయనను ఎ-2గా చేర్చాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్.. తనను పట్టించుకోకపోవడం, తన ప్రాధాన్యతను తగ్గించడం, ఇష్టం లేకపోయినా ఇటీవలి ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించడం లాంటివి వి జయసాయి రెడ్డికి నచ్చలేదు. పైగా పార్టీ ఓడిపోయిన తర్వాత కేసులు చుట్టుముడుతుండడంతో విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసి తప్పుకున్నారు.
విజయసాయి రెడ్డి తన రాజీనామా వెనుక భయం లేదని, ప్రలోభాలకు లొంగలేదని, విలువలు, విశ్వసనీయతతో జీవిస్తున్నానని ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీని వీడినట్లు ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ వివాదం వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తోందని, ఇతర నేతలు కూడా కూటమి పార్టీల వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామా, జగన్ వ్యాఖ్యలు, కూటమి ఆరోపణలు రాష్ట్ర రాజకీయ డైనమిక్స్‌ను ఎలా ప్రభావితం చేస్తాయనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.